30, ఏప్రిల్ 2016, శనివారం

ఖండకావ్యము - 13

రావోయి చ౦దమామ!
ర చ న : గురుమూర్తి ఆచారి

చ౦దురు డ౦తరిక్షమున చల్లని కా౦తుల నీనువాడు, మె
చ్చ౦ దగు న౦దగా డనుచు  సన్నుతి జేతురు శాస్త్రవేత్త లా
చ౦ద మదేమొ లేశము విచార మొనర్పగ దెల్లమాయె; దా
ని౦ దలపోయ నేలనొకొ! నీ నిలు వెల్లను రాతి ముక్కలే!  

క్షీర మహాబ్దిలో బొడమి శీతమయూఖుడు స౦తతమ్ము సొ౦
పారగ నిట్లు రాజిలు నట౦చు  భ్రమి౦చిరి తొల్లి; నేడు బ౦
డారము తేలిపోయినది; డ౦బము లేటికి? యెల్లవారు  ని
న్నారసి నవ్విపోదు రకటా! యిక దాగుము మబ్బు మాటునన్!

“క౦తుడు మెచ్చగా ప్రణయ కా౦తిని చల్లెద ప్రేమ జ౦టపై;
కా౦తుడ నేనె విశ్వమున; కా౦తుడ ని౦గి; నిశానిత౦బినీ
కా౦తుడ; తాప నాశకుడ; కల్వలకున్ జెలికాడ” నంచు న
శ్రా౦తము పొ౦గ నేటికి శశా౦క? యద౦తయు వ్యర్థమే యగున్!

{ కా౦తుడు = చక్కనివాడు. కా౦తినిడువాడు  }

అరయగ చ౦ద్ర వ౦శజులునై ధర నేలి యశ౦బు గా౦చి రా
పరమ పరాక్రమ స్థిరులు పా౦డవు లెల్లరు; శ్రీరమేశుడున్
నిరతము నిన్ను దాల్చె నొక నేత్రముగా; నిను నిత్యమున్ మహే
శ్వరుడును ప్రేమ తోడ తలపై ధరియి౦చె, న దేమి చిత్రమో!

తరుణి ముఖమ్ము వర్తుల సుధాకర బి౦బము బోలు న౦చు, నా
సరసిజ నేత్రి  హాస మొక చ౦ద్రిక య౦చు మహాకవుల్ వచి౦
చి; రయిన “కా౦తి నీ సహజ సిధ్ధము కాదని, క్షోణిమ౦డల
స్ఫురితమె చ౦ద్రమ౦డలము సూ” యని పల్కిరి శాస్త్రవేత్తలే!

తద్దయు గేలి సేసితిని; తప్పుల వీడి శమి౦పు మయ్య;నీ
పెద్దతనమ్ము నే నెరుగు విఙ్ఞుడ కాదయ; మాను మల్క; నా
“ముద్దుల చ౦దమామ” యను మోదము డె౦దము న౦దు చి౦ద నే
నెద్దియొ మాటలాడితి శశీ! నిజ మేదొ, మరే  దసత్యమో!

ప్రమదల పైన పూరుషుల పైనను తీక్ష్ణ సుమాయుధ ప్రయో
గము నొనరి౦చి వేట గొను క౦తుని స్య౦దన మైన యట్టి చ౦
ద్రమ! శరవేగ మేటికి, నిదానముగా చనుమోయి; యిప్పుడే
క్షమ పయి నెక్కు వయ్యె జన సా౦ద్రత; విశ్రమ మొ౦దు డిర్వురున్.

జన స౦ఖ్యాధిక మైన భూమి పయినన్ స్థానమ్ము లేదాయెగా!
వినుమో శీతకరా! మనుష్యుడు భవ ద్బి౦బమ్ముపై కాలు మో
పును, నిర్మి౦చును సౌధముల్, మరియు రేపో మాపొ తా యత్న మూ
ను నివాస౦ బొనరి౦ప; నీ విడుమ స౦తోషమ్ము సౌకర్యమున్.

సమస్య - 2019 (పాటుబడినవారి కెట్లు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
పాటుబడినవారి కెట్లు ఫలితము దక్కున్?

పద్యరచన - 1210

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

29, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఖండకావ్యము - 12

ముక్తి
రచన : లక్ష్మీదేవి

మనసు మూగదనుచు జాలి మానగవలెనోయి! మూగ
తనమేమొ, మనుజుని తనదు దారినిఁ గొనిపోవుచుండు,
కనుమయ్య! కట్టివేయగల కాఠిన్యమొకయింత లేక
మునుగుచునుందురు జగతి, మోహపు సాగరమందు.

ఎల్ల మరచి యాటపాటలేను గొప్పవటంచు నుంద్రు
కల్ల కపటములు లేని కలకల నగవుల బాల్య
మెల్ల, పిదప లోకములను మిగుల బాగుపరచ కాల
మెల్ల గడుపుచుందు,రేమి మేళులు చేయగ జాలు?

నిజమునెరుగునంతలోన నేల విడుచుకాలమౌను,
సజలనయనములతోడ శంకరుని పదము చేరి,
భజన చేయుచు వేడుకొంద్రు పాహి పాహియనుచు, నిట్టి
ప్రజలకు బుద్ధినిఁ గలిగి బ్రదుక, వరములియ్యవయ్య!

తొలగించగా యీతి బాధ తుదకైన కరుణించవేమి?
శిలవోలె నిలిచితి జాలి చిలుకంగ రావే యదేమి?
కలనైనఁ గనిపించి దారి కానగఁ జేయుమో స్వామి!
యిలపైన వేసట గలిగె యెప్పుడు పిలిపింతువేమి?

పశువునుఁ గాటన కట్టుపగిదిని నేర్పరాదొక్కొ!
నిశియందునహమందు నెపుడు నీమ్రోల నుంచరాదొక్కొ!
వశుడవీవంద్రు భక్తులకు భాగ్యమదియెగదమాకు,
పశుపతీ! దయజూడవయ్య! పరితపించెడు వారిపైన.

*  *  *  *  *  *  *  *  *  *  *

సమస్య - 2018 (విఱ్ఱవీగెడి వారలే...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
విఱ్ఱవీగెడి వారలే విజ్ఞు లనఁగ.

పద్యరచన - 2009

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

28, ఏప్రిల్ 2016, గురువారం

ఖండకావ్యము - 11

ఋతు సందేశం
రచన : మిస్సన్న (దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు)

చల్లగాలి తెరలు మెల్లగా వీచును
మల్లెపూల తావి మత్తు గొలుపు
కోయిలమ్మ పాట తీయగా మనసుకు
సంతసమ్ము నిడు "వసంత" వేళ!

ఎండ మండిపోవు నెఱ్ఱనై సూర్యుండు
గుండె లదర గొట్టు గుబులు హెచ్చు
ఉస్సు రుస్సు రంద్రు నూరూర జనములు
"గ్రీష్మ" తాప మిట్టి రీతి నుండు.

చిటపటమని వాన చినుకులు రాలును
ఏడురంగు లీను నింద్రధనువు
బీద బిక్కి వార్కి పిడుగు పాటై యొప్పు 
"వర్ష" ఋతువు మేలు కర్షకులకు.

రెల్లు దుబ్బు విరియు తెల్లని పింజలై
నిండు చందమామ నింగి వెలుగు
ప్రకృతి పులకరించు పారవశ్యమ్మున
"శరదృతువు" న పుడమి సందడించు!

మంచు బిందుచయము మంచి ముత్యములట్లు
మెరయు బాలభాను కిరణములకు
చలికి ముసుగు తన్ని సాగెడు వారికి
మంచి సుఖ మొసగు "హిమంత" మందు!

ఆకు రాల్చి తరువు లాశతో చూచును
క్రొత్త చివురు తొడుగు కోర్కెతోడ
రేపు మంచి దంచు రేపుచు నాశల
వశము చేసి కొనును "శిశిర" ఋతువు!

కాల దివ్య చక్ర గంభీర గమనాన
చీకటైన వెనుక చిందు వెలుగు
కష్ట సుఖము లిట్లె గమియించు బ్రదుకున
ఎరుక సేయు "ఋతువు" లిట్టి నిజము.

సమస్య - 2017 (చేతన్ జిప్పను ధరింత్రు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్.

పద్యరచన - 2008

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

27, ఏప్రిల్ 2016, బుధవారం

సమస్య - 2016 (త్రాడు ద్రెంచిన పురుషుండు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవసముఁడు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు. 

పద్యరచన - 1207

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

26, ఏప్రిల్ 2016, మంగళవారం

ఖండకావ్యము - 10

కాలభైరవాష్టకము
రచన : రాంభట్ల పార్వతీశ్వర శర్మ (అష్టావధాని)

పలుకువాడు! పిలువ పలుకుల నిడువాడు
పరమపావనుండు! భక్తివశుడు!
కష్టములను దీర్చు కాశీపురాధీశ
బైరవుండు! కాలభైరవుండు!!

శక్రుడేనికొలుచు జలజపదయుతుడు
ఉరగయజ్ఞసూత్ర ధరుడతండు
కృపకునబ్ధివోలె నుపమింప సరివచ్చు
బైరవుండు! కాలభైరవుండు!!

నారదాది యోగి నతుడు! దిగంబరుం!
డిందుశేఖరుండు! సుందరుండు!
విషముగొన్నవాడు! విషమాక్షునకునీడు!
బైరవుండు! కాలభైరవుండు!!

సూర్యకోటి బోలు సురిచిర దేహుండు!
తాండవప్రియుండు ! దండపాణి!
శూలటంకపాశ శోభిత హస్తుండు!
బైరవుండు! కాలభైరవుండు!!

ముక్తినిచ్చువాడు! మోహనాకారుండు!
భక్తవత్సలుండు! ప్రభుడతండు!
చారుకింకిణీ లసత్కటి శోభిత
బైరవుండు! కాలభైరవుండు!!

ధర్మవర్తనులకు దక్షుండు! దక్షాది
ధర్మదూరనాశ దక్షుడతడు!
మృత్యుదర్పమణచి భృత్యుల రక్షించు
బైరవుండు! కాలభైరవుండు!!

రత్నపాదుకావిరాజితపదములన్
సర్వసేవకాళి సాకునతడు!
అష్టసిద్ధులొసగు తుష్టినింకెవ్వడు?
బైరవుండు! కాలభైరవుండు!!

భీమవిక్రముండు! భీతిని పరిమార్చు
భూతనేత! నిత్యనూతనుండు!
అష్టకమ్ముజెప్పనాధారమైనాడు

బైరవుండు! కాలభైరవుండు!!

సమస్య - 2015 (కప్ప సంతుఁ గోరి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
కప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచె.

పద్యరచన - 1206

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

25, ఏప్రిల్ 2016, సోమవారం

ఖండకావ్యము - 9

శ్రీరామ స్తోత్రము
ప్రణీతము : పోచిరాజు కామేశ్వర రావు.

ద్విపద మాలిక :

శ్రీరామ! రఘురామ! సితదామ! రామ!
కారుణ్య వననిధీ! కాకుత్స్థ రామ!
జానకీవల్లభా! జనలోక రక్ష!
దానవ భంజనా! ధరణీశపుత్ర!
సీతా మనోహరా! శివచాప భంగ!
దాతాగ్రగణ్యేశ! దనుజేంద్ర దమన!
తాటక సంహార! తారక రామ!
పాటవ ధీశాలి! పరమాత్మ! రామ!
సత్యపరాక్రమ! శత్రుసంహార!
భృత్యానుకంపన పిశితాశనారి!
కోసల క్ష్మాభర్తకోదండ రామ!
కౌసల్య నందనా! కౌశిక శిష్య!
దశకంఠ సంహర్త! దాక్షిణ్య మూర్తి!
దశరధ నందనా! దయజూడు మమ్ము.

సమస్య - 2014 (యముఁ గని జనులెల్ల...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్.

పద్యరచన - 1205

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

24, ఏప్రిల్ 2016, ఆదివారం

ఖండకావ్యము - 8

మనస్సు
(మానస సీస నవరత్న మాలిక)
రచన : పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
సీ.         ఎచ్చోట వెదకిన నేపేరఁ జూచిన
కానరా దేరికి ఖండితముగ
ప్రాణికోటి సలుపు పాపపుణ్యంబుల
సాక్షిగ నిల్చు నీ  సమ్ముఖమున
పూర్వజన్మంపు టపూర్వ ఫలిత మన
సంచరించును నిస్సందియముగ
కీర్త్యపకీర్తులన్ కేళిగా దెప్పించి
నింగిని నేలపై నిల్పుచుండు
తే.         చంచలంబైన చిత్రంపు లంచగొండి
మరులు గొల్పెడు మధురంపు మాయదారి
దారి తప్పగ యత్నించు తపన గలది
మనసుతప్ప మరేముండు మాన్యులార!         1.

సీ.         సన్యాస ముంగొని సర్వంబు త్యజియించి
యదిమిపట్టగలేని యద్భుతంబు
ఘోరతర తపము తోరపు నిష్టతో
నమలు పరచలేని యద్భుతంబు
చిన్న పెద్దలలోన చిందులు ద్రొక్కుచు
హనుమ రీతి దిరుగు నద్భుతంబు
పుష్పబాణునిచేతి పూవింటి పగిదిని
నమరిన యపురూప మద్భుతంబు
తే.         ఏది యేదని యేదంచు నిహము పరము
వెదకి జూచిన దొరకునా వింతయైన
మనసుపేరున నొప్పెడు మాన్యమగుచు
బొమ్మకైనను బుట్టించు రిమ్మ తెగులు.                2.

సీ.         రావణబ్రహ్మయే రమణి సీతను బట్ట
దోహదపడినట్టి దుర్మనస్సు
రాజ్యాధికారియౌ రాజరాజు కపుడు
దోహదపడినట్టి దుర్మనస్సు
భస్మాసురునిచేయి భర్గుని శిరముంచ
దోహదపడినట్టి దుర్మనస్సు
కంసుని ప్రేరేచి కన్నయ్య దునుమాడ
దోహదపడినట్టి దుర్మనస్సు
తే.         ఇన్ని ఘోరాలు సలుపుచు నేహ్యమైన
పాపములకొడిగట్టె నీ పాడు "మనసు"
జన్మ జన్మాల వీడక జగతి దెచ్చి
నీడ వోలెను చరియించు నివురుగప్పి.               3.

సీ.         రాముని సైతము రాజ్యంబు బోనాడి
మాటనిల్పు మనిన మంచిమనసు
శిబిచక్రవర్తినే చిఱు పావురమునకై
మాంసంబు నిడుమన్న మంచిమనసు
రామనామము తప్ప రహివేరు లేదని
మార్గమ్ము సూచించు మంచిమనసు
పేద ధనికులన్న భేదాలు లేవని
మమతను సూచించు మంచిమనసు
తే.         జగతి పుణ్యాల నెలవుగా జంతుతతికి
కలుగజేయుచు వేవేల కాంతులీని
జన్మ ధన్యత గూర్చంగ చక్కగాను
కారణంబౌను సన్మతి క్రమముగాను.                 4.

సీ.         నాప్రభావాన వినాశం బగునుగాదె
వంశవృక్షంబెల్ల వరలకుండ
నాప్రభావాననె నవ్యంపు రీతి న
వాంకురంబెల్లను నందగించు
నాప్రభావాననె నవరసా లొలికించు
కావ్యాలు ప్రభవించు ఘనముగాను
నాప్రభావాననె నాట్యావధానముల్
మైమరచి సభల మరులుగొల్పు
తే.         నేనె మనసునుమెదడను నింటనుండి
కర్తనై , కర్మ బంధాలు కదలుచుండ
సర్వమున్నరసి జగతి సాగరాన
నీదుచుంటిని జన్మల నింతదనుక.                    5.

సీ.         అదుపులో బెట్టిన నందలమెక్కించి
రారాజుగాజేయు రాజు నేను
ప్రక్కకు దిరుగంగ నొక్కటి వ్రేయంగ
చక్కనై వర్తించు సాధు నేను
పగవారి జంపగ పన్నాగ మదియేల
వారిలో నున్నట్టి పోరు నేను
జగతిని శాంతిని జరిపింప గోరిన
పూర్ణమౌ స్వచ్ఛ కపోతమేను
తే.         నేను నేనన నేనేను నేనునేను
మేన నున్నట్టి సుకుమార మీను నేనె
యెట్టి యవతారమైనను మెట్టగలను
మనసుపేరిట బరగుచు మాన్యనైతి.              6.

సీ.         కానరాకుండుటన్ లేనని యందురా?
విష్ణ్వంశ నాయందు విపులతరము
చలనంబు లేదని తలఁపు మీ కుండెనా?
వాయువేగముమీరి వాలగలను.
కరుణ లేదని మీరు కన్నెఱ్ఱ జేతురా?
కష్టజీవుల జూచి కరగిపోదు.
మంచిచెడ్డలు నాకు మరిలేవనందురా?
మంచికి మంచిగా మసలుకొందు
తే.         ఇంత సద్గుణ శోభిత వింతజీవి
మనసునాబడు నేగాక మరొకటున్నె?
సత్య శోధన జేసిన సర్వమందు
నిదియె నిక్కంబని పరమేశుడనును.                 7.

సీ.         శస్త్ర ధారులునను చాకున బాకున
కండలుగాజీల్చ కానరాను.
బహువిధ మంత్రాలు పఠియించినంగాని
బయటపడగలేను భస్త్రినుండి
భక్తుల హృదయాన పరమాత్మ రూపాన
దాగియుందును నేను తప్పకుండ
ధ్యాన యోగములందు ధ్యాసను నిల్పిన
నిశ్చలత్వముగల్గి నిలచియుందు.
తే.         “మనసునేనేను సతతంబు మారుచున్న
మంచిచెడ్డలు పరికించి మనిషి కెపుడు
సాయమొనరింతు సంసారసాగరాన
మన్ననను నాకొసంగుడు మాన్యులార!              8

సీ.         ఖడ్గధారలకు నే గాయపడ నెపుడు
కఠినంపు మాటకే గాయపడుదు
విజ్ఞులు తిట్టిన విలువజేతునుగాని
యజ్ఞాని నిందింప నహముకలుగు
గురుతుల్యు నేవేళ కోరిమ్రొక్కెద నేను
శిష్యుల మాటన్న చేరిపిలుతు
ప్రేమతో లాలింప ప్రియరాగముంజూపి
యక్కున కెప్పుడు హత్తుకొందు
తే.         విశ్వమందలి పరమాత్మ విలువదెలిసి
మనసుకలిగిన మానవా! మసలుకొనుము
మానవాళికి శ్రేయంబు మహిత యశము
నన్ను  కాపాడుకొన్నను నాకమబ్బు.                 9

ఉ.         అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మనాదు చే
తమ్మున ప్రేమమై నవసుధారస ధారల గ్రుమ్మరించుచో
కిమ్మనకుండ వ్రాసితిని కేలును నాపక మానసంబుపై

నెమ్మది వీక్షజేయగను నే మదిగోరుదు పండితాళినిన్.        10

సమస్య - 2013 (కలుము లెడమైన...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు.

పద్యరచన - 1204

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని (బాగుగా) పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

23, ఏప్రిల్ 2016, శనివారం

ఖండకావ్యము - 7


 భారతీయ సిపాయి
రచన : ఆంజనేయ శర్మ (విరించి)

ఉ.       త్యాగము సేసినావుగద ధన్యుడవోయి సిపాయి మాతృభూ
భాగపు రక్షసేయ కడు భారపు దీక్ష వహించినావు నీ
వా గిరికానలందున నివాసము జేసి విదేశ వేగులన్
డేగలబోలు శాత్రువుల ఢీకొని నిల్చెదవోయి ధీరుడా!

ఉ.       భారతభూమి రక్షణయె బాధ్యతగా గొని తల్లిదండ్రులన్
దారసుతాదులన్ విడిచి ధారుణి యంచున కొండ కోనలన్
జేరిన త్యాగమూర్తులు నజేయ పరాక్రమ శీలులౌ మహా
ధీరులు మీదు త్యాగధన దీప్తుల నెంచ మహోజ్వలంబులౌ.

ఉ.       శ్రీకర భారతావని విశిష్టచరిత్రయు రత్నగర్భతన్
సాకృతి నొప్పు సంస్కృతుల సంచితశోభల మాతృభూమినిన్
పోకిరి మ్లేచ్చులీ యవని పుణ్య సుసంస్కృతి మ్రుచ్చలింపగాన్
పోకిరి చేష్టలన్ దునుమ పోరును సల్పి మదంబు ద్రుంచుమా.

ఉ.       ఆరడి పెట్టు దుర్జనులనంతము సేయగ రుద్రమూర్తివై
పోరును సల్పు, రక్కసుల పోకిరి మూకల నాశనంబునే
కోరితి నుగ్రవాదమును కూకటివ్రేళుల సంహరించుమా
భారతి కీవు రక్ష సుర భారతి నీకు సదా సురక్షయౌ.

ఉ.       భారము గాదు నీకు భవబంధములన్ విడనాడి ద్రోహులన్ 
మారణకాండ సల్పుదువు మాన్యుడవైన సిపాయివోయి సం
హారము జేసి శాత్రవుల నంతము జేయుము వారి దుష్కృతుల్ 

తీరదు నీ ఋణం బెపుడు తీర్చగ జాలరు భారతీయులున్ .  

సమస్య - 2012 (వల్లకాటిలోఁ దిరుగు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
వల్లకాటిలోఁ దిరుగు శ్రీవల్లభుండు.

పద్యరచన - 1203

కవిమిత్రులారా,


పైచిత్రాన్ని (బాగుగా) పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.
హతవిధీ! పూలుండడం వల్ల గుర్తించలేకపోయారు. 
ఇప్పుడు పూలు లేకుండా ఇచ్చాను. 

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

సమస్య - 2011 (రోకలికి కాలు జాఱె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
రోకలికి కాలు జాఱె తె మ్మాకుమందు.

పద్యరచన - 1202

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

21, ఏప్రిల్ 2016, గురువారం

ఖండకావ్యము – 6 (సరస్వతీ!)

సరస్వతీ!
రచన : లక్ష్మీదేవి

శా.      విద్యార్థుల్ నిను వేడుకొందు రిలలో వీణాధరీ! దీవనల్
సద్యోగంబుల నిమ్ము, శుద్ధచరితా! శాతోదరీ! పావనీ!
పద్యం బన్నను నీరస మ్మనక పక్వంబౌ మహాశ్రద్ధతో
నుద్యోగమ్మున నేర్చుకొ మ్మనుచు నీ వొప్పింపగా రాగదే!

మ.     కరమున్ బట్టుదు పుస్తకంబు, మనమున్ కైంకర్యమున్ జేతు, నీ
దరికిన్ బిల్వుము శారదా! చదువులన్ దానంబుగా నిచ్చెదో,
వరముల్ వేయు నవేల చాలు నదియే, వాణీ! సదాచారిణీ!
స్థిరమౌ దృష్టిని నన్ను గాచుకొనుమా శ్రీమంగళాకారిణీ!

పంచచామరము
సదా మదిన్ దలంతు నిన్ను శ్రద్ధతో, సరస్వతీ!
పదమ్ము లిట్లొసంగుమా! కృపామయీ, సరస్వతీ!
ముదమ్ముతోడఁ దీర్చుకొందు మ్రొక్కులన్, సరస్వతీ!
పదమ్ముఁ జేరుకొందు, మోక్ష ప్రాప్తికై, సరస్వతీ!

మత్తకోకిల
వీణఁ బట్టిన శారదాంబకు వేశుభమ్ములు పల్కుమా!
ప్రాణికోటికి విద్యనిచ్చెడు భారతీ జయ మందుమా!
పాణిఁ బట్టిన ధాతృపత్నికి, వందనమ్ములు పల్కుమా!

వాణి, పుస్తకపాణి, ముజ్జగవంద్యకున్ శుభమందుమా!