14, నవంబర్ 2012, బుధవారం

సమస్యా పూరణం - 877 (ధనువే సాధ్వి కరంబునందు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ధనువే సాధ్వి కరంబునందలరె నత్యంతోగ్ర సర్పాకృతిన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రులకు ధన్యవాదములు.

17 కామెంట్‌లు:

  1. చనె శ్రీకృష్ణుని వెంట యుద్ధమున కుత్సాహాతిరేకమ్ముతో
    వనితారత్నము సత్యభామ నరకున్ బాపాత్ము దైత్యాధినా
    థుని డాసెన్ సమరాన చూపరులకున్ దోచెన్ మహాకాళిగా
    ధనువే సాధ్వి కరమ్మునం దలరె నత్యంతోగ్ర సర్పాకృతిన్

    రిప్లయితొలగించండి
  2. కన - నారాయణుడయ్యె ’కృష్ణుని'గ; శ్రీ క్ష్మామాతయే ’సత్య’గాన్;
    వినతా పుత్రుడయెన్ రథంబుగ; చనెన్ వేవేగ వైకుంఠమే
    ఘన సైన్యంబయి; దైత్యుడా నరకునిన్ ఖండింప - శేషుండునై
    ధనువే, సాధ్వి కరమ్మునం దలరె నత్యంతోగ్ర సర్పాకృతిన్!

    రిప్లయితొలగించండి
  3. మునుపా మాంత్రికు డొక్కరుండు సభలో మోదంబునుం గూర్చుచున్
    తనశక్తిన్ బ్రకటించుచున్ క్రమముగా దండంబు సారించుచున్
    వనితారత్నము చేతిలోని ధనువున్ బల్మారు మంత్రించగా
    ధనువే సాధ్వి కరంబునందలరె నత్యంతోగ్రసర్పాకృతిన్.

    రిప్లయితొలగించండి
  4. కనుమా శాంభవి జృంభణంబనిని, హుంకారంబు, నా శ్రీముఖం
    బున, దుర్గాంబ మహోగ్రతన్ గనుము; నంభోజాత నీలీల నా
    దనుజున్, మూర్ఖుని ద్రుంచుచో మిగుల, క్రోధావేశ రూపంబునన్
    ధనువే సాధ్వి కరంబునందలరె నత్యంతోగ్ర సర్పాకృతిన్.

    రిప్లయితొలగించండి
  5. నేమాని పండితార్యుని బాటలో చిరు ప్రయత్నం:

    కనగా కృష్ణుని భామ నా రథముపై కల్పాంత కాలోగ్ర కా-
    ళిని బోలెంగనులెఱ్ఱ బారగను కేళీ లీలగా నెక్కిడన్
    ధనువే సాధ్వి కరంబునందలరె నత్యంతోగ్ర సర్పాకృతిన్
    కనులం దోచెను మృత్యుభీతి కరమై కల్యాణి నా దైత్యుకున్.

    రిప్లయితొలగించండి
  6. పెద్దలు నడచిన దారిలోనే.................

    అనిఁనాదైత్యమహోగ్రభీకరుడుసైన్యంబున్ నివారించుచూ
    ఘనమౌరీతి ప్రచండరూపుడయిసంగ్రామంబుఁజేయంగనా
    వనితారత్నము సత్యభామ కడువిభ్రాంతిన్ ధరించంగనా
    ధనువే సాధ్వికరంబునందలరె నత్యంతోగ్రసర్పాకృతిన్.

    రిప్లయితొలగించండి
  7. లక్ష్మీ దేవి గారి స్ఫూర్తితో

    కనియెన్ దుర్గను దైత్యుడెఱ్ఱ కనులన్ కంపించు దేహమ్ము దా-
    ల్చిన ఖడ్గమ్మును శంఖు చక్ర గదలన్ చింతించె తానిట్టు లా
    ధనువే సాధ్వికరంబునందలరె నత్యంతోగ్రసర్పాకృతిన్
    దనుజుండాపెను `రెప్పపాటు మదిలో ధైర్యంబు క్షీణించగన్.

    రిప్లయితొలగించండి
  8. కోపగృహం లో శ్రీకృష్ణుడి స్వగతం:

    ప్రణయావేశమొ,నాపయిన్జెలులు నేరారోపణల్జేసిరో,
    ఘననారీచయమందు వేరెవరికో కల్యాణముల్కల్గెనో,
    ననవిస్పూర్జితనీలవే, ణెపుడు మాన్యమ్మై స్మరుండూనెడా
    ధనువే, సాధ్వి కరమ్మునం దలరె నత్యంతోగ్ర సర్పాకృతిన్!

    నీలవేణి - శబ్దార్ధం లో ప్రయోగించానండి, ఎప్పుడూ మన్మధునికి ధనువై ఒప్పే జడ - నేడు సర్పము వలె ఉన్నది అనే అర్ధం చెప్పాలని శక్తికి మించిన ప్రయత్నం.
    భవదీయుడు

    రిప్లయితొలగించండి
  9. రామకృష్ణ గారు,
    అందమైన దృశ్యాన్ని అందంగా ఆవిష్కరించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. విరాటపర్వంలో కీచకుడు సైరంధ్రిని జూచి ఆమెతో మాటలాడే దృశ్యం :

    వినవే జవ్వని మీనకేతనుడి పూవిల్లయ్యెనా నీకు భ్రూ
    ధనువే ? సాధ్వి ! కరంబునందలరె నత్యంతోగ్ర సర్పాకృతిన్
    ఘనమై వేనలి ! యింతి నీ కనులు పోకార్చున్ సరోజమ్ములై
    తనువే పూలత వోలె నిల్చును గదా ! తాదాత్మ్యమున్ జెందగన్.

    రిప్లయితొలగించండి
  12. శ్రీపతిశాస్త్రిబుధవారం, నవంబర్ 14, 2012 10:29:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    వినగా వింతగ దోచదా మగువ వీరావేశమున్ బొందుచున్
    దునుమాడన్ నరరూపరాక్షసుల దుర్మార్గంబులన్ క్రోధియై
    ఘనమౌ రూపము దాల్చె నా జనని కాళీమాతయైనిల్వగా
    ధనువే సాధ్వి కరంబునందలరె నత్యంతోగ్ర సర్పాకృతిన్.

    రిప్లయితొలగించండి
  13. దనుజేశున్నరకాసురున్ రణములో ధ్వంసంబు గావించగా

    జను శ్రీ కృష్ణునకున్ సహాయమొనరించన్ బోయి క్రోదాగ్నితో

    దన ప్రాణంబులు లెక్కజేయకను యుద్ధంజేసె సత్యావతీ

    ధనువే, సాధ్వి కరంబునందలరె నత్యంతోగ్ర సర్పాకృతిన్.

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రులకు నమస్కృతులు.
    రెండు మూడు రోజులుగా పండుగ, నోముల కోసం బంధువుల ఇళ్ళకు వెళ్ళిరావడం వల్ల పూరణలను, పద్యాలను సమీక్షించలేకపోయాను. మన్నించండి.
    *
    ఈనాటి సమస్యకు చక్కని పూరణలు అందజేసిన
    పండిత నేమాని వారికి,
    డా. ఆచార్య ఫణీంద్ర గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    మిస్సన్న గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    రామకృష్ణ గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    రామకృష్ణ గారు ‘నీలవేణి + ఎపుడు’ సంధి చేసారు. అక్కడ యడాగమం వస్తుంది. ‘నీలవేణి యిదె’ అంటే సరి!
    గండూరి లక్ష్మినారాయణ గారు ‘యుద్ధం జేసె’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘యుద్ధం బందు’ అంటే సరిపోతుందేమో...

    రిప్లయితొలగించండి
  15. గురువు గారు,సవరణకు ధన్యవాదములు.
    లక్ష్మీదేవి గారు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  16. కనులన్ కాటుక తీర్చకుండగను తా కంఠమ్మునన్ హారమున్
    చనుచున్ వంగ మసీదు లందునను తా సైయంచు పర్దాలతో
    మునుపే రాణియు నూనజాల నదియౌ ముల్లాల రక్షార్థమౌ
    ధనువే సాధ్వి కరంబునందలరె నత్యంతోగ్ర సర్పాకృతిన్

    రిప్లయితొలగించండి