31, మే 2018, గురువారం

ఆముదాల మురళి గారి శతావధానము – 2వ భాగము


దత్తపది
1) "ఆది - సోమ - మంగళ - బుధ" అవధాన విద్యా వికాసం.
(డా. అమళ్ళదిన్నె వేంకట రమణ ప్రసాద్ గారు)
.        ఆదిన మాడభూషి మహితాన్వయమూర్తి మహత్తు చేత సం
పాదిత సోమరేఖ యొక మచ్చ నెఱుంగని పూర్ణచంద్రుఁడై
వేదవధానవిద్య ప్రభవించెను మంగళరూపసంపదల్
మోదముఁ గూర్చెఁ దెల్గునకు మూదలగా బుధవర్గ మంతటన్.

2) "తల - మెడ - కడుపు - నడుము" శ్రీవేంకటేశ్వర స్తుతి.
(మైలవరపు మురళీకృష్ణ గారు)
చం.    తలఁపుల బోడి సేసి నను దగ్గరఁ జేర్చుము మోక్షసిద్ధికిన్
బల మెడఁబాసి వృద్ధుఁ డగుపట్టున వత్తునె గొల్వ ముందు బా
ముల నొనరించినా నొకడు పుణ్యముఁ బాపము నేరనయ్య నా
తలఁపుల నిల్చి గావు వరదా! నడు ముందు కటంచుఁ ద్రోసి నన్.

3) "సుమిత్ర - కైక - తార - సీత" భారతార్థంలో...
(M.S.V. గంగరాజు గారు)
ఉ.     మీరు సుమిత్రబాంధవులు మీరు మహాత్ములు మీరు కేశవా!
పోరునకై కరం బిడరె పొమ్మని చెప్పక భక్తరక్షకా!
తారలు రాలునట్లుగ నధర్మపరాయణు లాహవంబునన్
జేరియుఁ జంపకుండిన నిసీ తలవ్రాతలు మారబో వికన్.

4) "వాన - ముసురు - జల్లు - జడి" వేసవిలో జనుల స్థితి.
(కంది శంకరయ్య గారు)
తే.గీ. మండుటెండల మధువాన మనసు గల్గు
కోరిక ముసురుఁ జెమ్మటల్ గారుచుండు
దుమ్ము వెదజల్లు నెండలు దమ్ముఁ జూపు
జడిసి బయటకు రాఁబోరు జనులు చూడ.

5) "గగగ - ననన - మమమ - లలల" స్వేచ్ఛాంశం...
(మాధవ రెడ్డి గారు)
తే.గీ. సాగ గగనధుని యగుచు సరసకవిత
చాన ననఁబోడి సాహిత్యచారుమూర్తి
భామ మమతల గుడియైన పద్యవిద్య
బాలల లలితవాక్యమౌఁ బరమసుఖము.

6) "అగ్నిగర్భ - కనులముందు - శిలాయజ్ఞం - గంధకుటి" భారతార్థంలో...
(డా. కలువగుంట రామమూర్తి గారు)
ఉ.     విజ్ఞత లేక ధూర్తపృథివీపతి ద్రౌపది నగ్నిగర్భఁ దా
నజ్ఞత నీడ్చె నీ సభకు నందరి కన్నులముందు పెద్దలున్
బ్రాజ్ఞులుఁ బల్కరైరి యిది పాప మటంచును భీమవాక్శిలా
యజ్ఞము వీరగంధకుటియై మిముఁ గాల్చును కౌరవేశ్వరా!

7) "పాలు - పెరుగు - వెన్న - నేయి" కురు పాండవుల ఆస్తి పంపకాలు.
(సుబ్బ రాఘవ రాజు)
ఉ.     కౌరవరాజ! పాలు నిడఁగా నినుఁ గోరిరి పాండవేయులున్,
గౌరవ మెంతయో పెరుగుఁ గానఁ బ్రసన్నుఁడవై ముదంబునన్
జేరఁగఁ బిల్చి భాగములు చేసి యొసంగుము, వెన్న రాసినన్
మీరలు వాఁతఁ బెట్టినది మేలగునే? యిలుఁ జేరఁ బోయెదన్.

8) "నీరు - మీరు - బారు - బీరు" పద్మావతీ స్తుతి...
(డా. మన్నవ గంగాధర ప్రసాద్)
తే.గీ. కారు కన్నీరుఁ దుడువవే కమలనయన!
మేర మీరు కష్టమ్ముల దారిఁ జూపి
తుమ్మెదల బారు వేనలితోడ నొప్పు
వేంకటేశదయిత! నేను బీరుఁ డమ్మ!

9) "శవము - పాడె - చితిమంట - తర్పణము" పెండ్లి వేడుక...
(టెంకాయల దామోదరం)
తే.గీ. శైశవము దాఁటి పెండ్లాడు సమయమయ్యెఁ
బాట పాడె సువాసిని పరిణయమునఁ
గంటిరెప్పగాఁ బెంచితి మంట లేక
బ్రతుక నన్నసంతర్పణవ్రతముఁ జేతు.

10) "కందు - సందు - మందు - విందు" భాగవతార్థంలో...
(డా. మాలేపట్టు పురుషోత్తమాచారి గారు)
ఉ.     కందుకమయ్యెఁ గొండ, యురగం బొక రంగము నాట్యమాడఁ,
న్విందునుఁ గూర్చు మోము, నునువెచ్చని మాట పసందుఁ జూడ నే
మందును? ముగ్ధలార! యతఁ డాంతరబాహ్యజగంబు లంత టా
నందమయుండుగా వెలుఁగు నందకుమారుఁడె నిందఁ జేయఁగన్?

11) "తల - వల - జల - కల" గురుశిష్య సంబంధం...
(విద్వాన్ జి. గోవిందయ్య గారు)
ఉ.     చేఁతల దిద్దు దేశికుఁడు శిష్యుల వ్రాతలు మారునట్లుగన్
బూఁత మెరుంగు రీతి వలపున్ సరి జేయును గుండెలందునన్
నీతులు నూరిపోయుఁ దటినీజలతీర్థము లందియిచ్చుచున్
చేఁతలు మాట లొక్కటిగఁ జేయును పోకల రాకలందునన్.

12) "కట్టు - గట్టు - పట్టు - రట్టు" ద్రౌపది మాతృహృదయం...
(శ్రీరాములు గారు)
ఉ.     కట్టుదు రేల వీని శిశుఘాతకుఁ డంచును భర్తలార! రా
గట్టుకుమారి లీలలివి గర్భము క్రుంగెడుఁ గన్నతల్లికిన్
పట్టును వీడుఁడింకఁ బసిపాపలఁ జంపినవాని శత్రువున్
రట్టుగఁ జేయనేల? యిది బ్రాహ్మణహత్యకు దారిఁ దీసెడున్.

13) "తాపము - పాపము - కోపము - లోపము" స్త్రీలు లోకకళ్యాణ కారకులు...
(డా. వి. జయమ్మ గారు)
ఉ.     తాపము జాతికెల్లఁ బరితాపము నొందిన భారతావనిన్
బాపము నెంచకుండఁ బలు బాధలు పెట్టిన నాదిశక్తియై
కోపముఁ బూనె నా కుసుమకోమలి కన్నుల నెఱ్ఱఁ జేసినన్
లోపము గల్గు భాగ్యములు లోకము లెల్లను భస్మమయ్యెడిన్.

14) "మమత - సమత - నవత - ఘనత" దేశాభివృద్ధిలో మహిళ పాత్ర...
(డా. మస్తానమ్మ గారు)
తే.గీ. ప్రేమ మతమును బ్రతుకులోఁ బెంచువార
లసమతత్త్వంబుచే దుఃఖ మనుభవించి
నవతరంబును దీర్చెడి నవ్యమతులు
ఘనత నిత్తురు స్త్రీలు ప్రగతుల నొసఁగి.

15) "మొల్ల - ఎల్ల - కల్ల - చల్ల" రామాయణార్థంలో...
(డా. పి.సి. వెంకటేశ్వర్లు గారు)
ఉ.     మొల్లలు మాలఁ గూర్చి మునుముందుగ వచ్చిరి పౌరులందరున్,
ఎల్లలు లేని సంతసము హెచ్చెను రాజుకు, దాసి పుష్పముల్
చల్లఁగ వచ్చె రాముఁడు, పిశాచము మందర కైకఁ జేరి తా
కల్లరిమాటలం బలుకఁ గానల కేగెను రాముఁ డంతటన్.

16) "వడ - పూరి - దోస - ఉప్మా" భారతార్థంలో...
(కత్తి మమత గారు)
మ.    వడఁకెం గౌరవసైన్యమంత ననిలోఁ బార్థుండు విల్లందఁ గృ
ష్ణుఁడు పూరించెను పాంచజన్యమును బంధుప్రీతితోఁ బోరఁ గ
వ్వడితోఁ బోరినవారి కెల్ల గలిగెం బంచత్వ మౌరౌర దో
సెఁడు రారాజు యశోవికాసమునకై చీ యుప్మనెన్ వంశమున్.

17) "వారేవా - తూరేతూ - పీరేపీ - జారేజా" రామాయణార్థంలో...
(మాధవీలత గారు)
శా.    వారే వారిధి దాఁటి వచ్చిరిక భవ్యంబైన యీ లంక పెం
పీరేపీడ్వడు గాన రాము నొక రాజేంద్రుండుగా నెంచ సం
తూరే తూలము గాగ గాలి కెగురున్ దుఃఖంబు గల్గున్ దలల్
జారే జాజులు గాగ రావణ! మహాశస్త్రాగ్నిలోఁ జిక్కెడున్.

18) "క్రీస్తు - ఏసు - మేరి - సిలువ' భాగవతార్థంలో...
(డా. నెమిలేటి కిట్టన్న గారు)
మ.    "హరి! చక్రీ! స్తుతియింతు నీదు పదముల్ ధ్యానింతు నీరూపమున్
సరియే సుస్థిరమోక్షరాజ్యమునకున్ సంసారసౌఖ్యంబు? నా
తరమే రిత్త జగంబు దాట" నని సంధానించెఁ జిత్తంబు లా
పరమాత్మన్ భజియింప భాసిలు వచోభానుండు ప్రహ్లాదుఁడున్.

19) "బడి - ఒడి - గుడి - మడి" ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ...
(యువశ్రీ మురళి గారు)
చం.    బడి గుడి యంచు నెంచి మన పాలకు లెల్లరు చిత్తశుద్ధితో
నొడి నిడి నేర్పగావలయు నుద్ధతిఁ జూపెడి లేమి పోవగా
గుడిసెలు పోయి యుండుటకు గూడును కూడును గల్గ విద్యయ
న్నుడి మడి దున్నగావలయు నూత్నజగంబుల సృష్టిఁ జేయఁగన్.

20) "లవరు - కవరు - పవరు - ఎవరు" దాంపత్య జీవనం...
(డా. నాదెండ్ల శ్రీమన్నారాయణ గారు)
చం.    లవ రుష గల్గినంత ననురాగము వీడుట పాడి యౌనొకో
సవరణ చేసుకోక వరుసన్ బరుషంబుల దంపతీజనుల్
శివముల నాడరాదు గుణశీలురు పాపవరుల్ ముదాన లే
రెవరు జగంబునం చనుచు నెల్లరుఁ గీర్తన సేయుచుండఁగన్.

21) "కొట్టము - గొట్టము - చుట్టము - మట్టము" రాయబారానికి వెళ్ళుచున్న కృష్ణునితో ధర్మరాజు పలుకులు...
(గంగుల నాగరాజు గారు)
ఉ.     కొట్టము రాజ్యలోభమునఁ గూరిమి నిచ్చిన నైదు గ్రామముల్
గొట్టమువంటి శూన్యమునకున్ తపియించుట గాదు దాయలున్
జుట్టములే కదా పొడుచుచుండినఁ కత్తులు యుద్ధమందునన్
మట్టము గావె వంశములు మాధవ! యుద్ధము మాన్పి రమ్మికన్.

22) "నిండ - ధూస్ర - ష్ఠుల్మి - బూసు" తెలుగు భాషయొక్క ఔన్నత్యం...
(మల్లిపూడి రవిచంద్ర గారు)
తే.గీ. గుడులు గట్టియుఁ గొల్వరే గుండెనిండ
ప్రియవధూస్రక్తరాంతఃపరీమళంబు
గలుగు వాక్యము శ్రేష్ఠు ల్మిగుల హసించి
యొంటికిన్ బూసుకొనియెడు సెంటు తెలుఁగు.

23) "గంగ - గంగ - గంగ - గంగ" ఎక్కడా 'నీరు' అనే అర్థం రాకుండా గంగావతరణ వర్ణన...
(తారకరామ్ గారు)
మ.    తపముం జేయ భగీరథుండు వనికిన్ తా నిష్ఠ సాగంగ స
త్కృపతో వే యొసగంగ బ్రహ్మ వరమున్ గీడెంచి శీర్షంబునన్
జపలన్ శంకరుఁ డడ్డుకట్టి వదలెన్ జహ్నుండు ద్రాగంగ స్వ
ర్గపదంబందున నుండి వచ్చె భువికిన్ గంగమ్మ వేగం గదా!

24) "వనిత - లలిత - అనిత - మమత" రామాయణార్థంలో...
(సాత్పాటి సురేశ్ గారు)
తే.గీ. వనిత సీతమ్మ చూచెను వనములోన
లలితలతలందు బంగారు లక్షణముల
ననితరంబైన జింక తా నడిగినంత
రాముఁ డరిగెను మమతతో రయముగాను.

25) "మూర - బార - చేర - మేర" రామాయణార్థంలో...
        (విద్వాన్ బి. కన్నయ్య గారు)
చం.    పురహరుభక్తునిన్ గపిచమూరణతంత్రవినూత్నరీతి సం
బరములు మేర మీర వడిఁ బారఁగఁ జేసిన వైన మెన్నఁగా
స్థిరతర రామమంత్రకృతిచే రహియించెను గాక గెల్వ వా
నరులకు శక్యమే రణమునన్ దితిపుత్రుని రావణాసురునిన్.

సమస్య - 2693 (రక్తముఁ ద్రాగెదను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే"
(లేదా...)
"రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో"

30, మే 2018, బుధవారం

సమస్య - 2692 (అయ్యొ సుకవీశ్వరా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"అయ్యొ సుకవీశ్వరా గడు పయ్యె నెట్లు"
(లేదా...)
"అయ్యయ్యో కడు పయ్యెనేమి కవినాథా నీకుఁ జిత్రంబుగన్"

29, మే 2018, మంగళవారం

సమస్య - 2691 (అర్చించెను రాత్రి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"అర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్"
(లేదా...)
"అర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుఁడు భానుబింబమున్"

28, మే 2018, సోమవారం

సమస్య - 2690 (దీపమ్మును ముద్దిడ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్"
(లేదా...)
"దీపము ముద్దుగొమ్ము సుదతీ సుఖ మబ్బు వియోగవేళలన్"

27, మే 2018, ఆదివారం

జడశతకము కవుల పట్టిక

"జడ శతకము"నకు పద్యాలను పంపిన వారి పట్టిక క్రింద ఇస్తున్నాను. ఇందులో పేర్లు తప్పిపోయినవారు దయచేసి తాము తమ పద్యాలను బ్లాగు, శంకరాభరణం, జడశతకము వాట్సప్ సమూహాలు, నా జిమెయిల్ లలో ఎందులో ప్రకటించారో తెలియజేయండి. ఇక పేర్లు ఉన్నవారు తమ పూర్తిపేరును, ఊరి పేరును నా వ్యక్తిగత మెయిల్లో (shankarkandi@gmail.com) కాని, జడశతకం వాట్సప్ సమూహంలో కాని తెలియజేయండి. తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు కొందరి ఊరి పేర్లను వ్రాసున్నాను. సరియైనవి కాకుంటే తెలియజేయండి.
001. డా. విష్ణు నందన్ (హైదరాబాదు)
002. గోలి హనుమచ్ఛాస్త్రి (గుంటూరు)
003. గుండు మధుసూదన్ (వరంగల్లు)
004. ఆకుండి శైలజ (విజయనగరం)
005. గుండా వేంకట సుబ్బ సహదేవుడు (ప్రొద్దుటూరు)
006. పి. లక్ష్మణాచార్యులు
007. సంగు గురుచరణం
008. బి. రాము
009. గుమ్మా నాగ మంజరి
010. గౌరీభట్ల బాల ముకుంద శర్మ
011. ఊర ఈశ్వర్ రెడ్డి
012. కోడూరి శేషఫణి శర్మ
013. గుఱ్ఱం సీతాదేవి (నెల్లూరు)
014. విట్టుబాబు (చెన్నై)
015. ఐతగోని వేంకటేశ్వర్లు
016. అవుసుల భాను ప్రకాశ్ (సంగారెడ్డి)
017. బిట్రా వెంకట నాగ మల్లేశ్వర రావు
018. చక్రవర్తి
019. డా. హెచ్. వరలక్ష్మి (విశాఖపట్టణం)
020. మద్దిరాల శ్రీనివాసులు
021. మంగళంపల్లి పాండురంగ విఠల్
022. డా. బల్లూరి ఉమాదేవి
023. ముంజంపల్లి వీర బ్రహ్మేంద్రాచార్య
024. జంగం జ్యోతిర్మయి
025. గంగుల ధర్మరాజు (నంద్యాల)
026. ఘాలి లలితా ప్రవల్లిక
027. అంబటి భాను ప్రకాశ్ (గద్వాల)
028. సుధాకర్ గౌడ్
029. బొగ్గరం ఉమాకాంత ప్రసాద్ (గుంటూరు)
030. గుఱ్ఱం జనార్దన రావు
031. వారణాసి నాగేశ్వరాచార్యులు
032. చంద్రమౌళి సూర్యనారాయణ (హైదరాబాదు)
033. దార్ల వేంకటేశ్వర రావు
034. ఆచార్య రాణి సదాశివ మూర్తి
035. బండకాడి అంజయ్య గౌడ్ (హైదరాబాదు)
036. MVVS శాస్త్రి
037. పూసపాటి కృష్ణ సూర్య కుమార్ (గుంటూరు)
038. పోచిరాజు సుబ్బారావు (హైదరాబాదు)
039. డా. మునిగోటి సుందర రామ శర్మ
040. దివాకర శాస్త్రి
041. పెందోట వెంకటేశ్వర్లు
042. బద్రిపల్లె శ్రీనివాసులు
043. చెఱుకూరి తరుణ్ (విశాఖపట్టణం)
044. గోగులపాటి కృష్ణమోహన్ (హైదరాబాదు)
045. డి. శ్రీనివాసులు (కవితశ్రీ)
046. VVN వరలక్ష్మి
047. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి (హైదరాబాదు)
048. తురిమెళ్ళరాధాకృష్ణమూర్తి
049. ముమ్మడి చంద్రశేఖరాచార్యులు
050. డా.ఎన్.వి.ఎన్.చారి (వరంగల్లు)
051. ప్రవీణ్ కుమార్
052. కిలపర్తి దాలినాయుడు
053. గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ
054. ఆత్రేయ ప్రసాద్ (విశాఖపట్టణం)
055. విరించి (హైదరాబాదు)
056. వెలిదె ప్రసాదశర్మ
057. మహ్మద్ షరీఫ్ (సంగారెడ్డి)
058. జంధ్యాల ఉమాదేవి
059. బండి సూర్యారావు
060. మాడుగుల మురళీధర శర్మ (సిద్ధిపేట)
061.  SVLN శర్మ
062. భండారం నాగ వెంకట కళ్యాణ చక్రవర్తి
063. ఆకుల శాంతి భూషణ్
064. జొన్నలగడ్డ శ్రీనివాస రావు
065. డా. వెలుదండ సత్యనారాయణ (హైదరాబాదు)
066. అనుసూరి వేంకటేశ్వర రావు (అవేరా)
067. పూర్ణ కృష్ణ (జోగిపేట)
068. సాగర్ల సత్తయ్య
069. KL నారాయణ
070. మైనంపాటి వరప్రసాదరావు (ఒంగోలు)
071. స్వయంవరపు అప్పారావు
072. భమిడిపాటి కాళిదాసు (అనకాపల్లి)
073. చెరుకూరి శర్మ
074. వేలేటి శైలజ (సిద్దిపేట)
075. మైలవరపు మురళీకృష్ణ (వెంకటగిరి)
076. దివాకర శాస్త్రి
077. బస్వోజు సుధాకరాచారి
078. కట్టరంజిత్ కుమార్ (సిద్ధిపేట)
079. బండి సూర్యారావు (హైదరాబాద్)
080. చేపూరి శ్రీరామారావు (వరంగల్లు)
081. వడ్ల ప్రసన్న కుమార చారి (సంగారెడ్డి)
082. ఎల్లికంటి ప్రసూనా శర్మ
083. కంజర్ల రామాచార్య
084. మాచవోలు శ్రీధరరావు (హైదరాబాదు)
085. అష్టకాల విద్యాసాగర్
086. ముడుంబై ప్రవీణ్ కుమార్
087. గంగాపురం శ్రీనివాస్
088. పింగళి పూర్ణచంద్ర రావు
089. తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష (మహబూబాబాదు)
090. సముద్రాల శ్రీనివాసాచార్య
091. చిటితోటి విజయ కుమార్ (కలకత్తా)
092. అమరవాది రాజశేఖర శర్మ
093. దర్శి బాల సుబ్రహ్మణ్యం
094. అవధాని కోట రాజశేఖర్ (నెల్లూరు)
095. మద్దా సత్యనారాయణ
096, బూసారపు నర్సయ్య (హైదరాబాదు)
097. KR రాజేశ్వర్ రావు
098. కె. ఈశ్వరప్ప
099. గడ్డిపాటి శ్రీకాంత్
100. జిలేబి (రాణిపేట, తమిళనాడు)
101. నేదునూరి రాజేశ్వరి (న్యూజెర్సీ, అమెరికా)
102. విరించి (హైదరాబాదు)
103. సొలాస సీతా రామయ్య
104. గురుమూర్తి ఆచారి
105. శ్రీపతి శాస్త్రి (తిరుపతి)
106. వీటూరి భాస్కరమ్మ
107. బొగ్గరం VVHB ప్రసాద రావు (గుంటూరు)

ఆముదాల మురళి గారి శతావధానం - 1

సమస్యాపూరణలు
1) "మురళికి రంధ్రముల్ వడెను ముచ్చటగా శతసంఖ్య లొప్పుచున్"
(డా. అమళ్ళదిన్నె వేంకట రమణ ప్రసాద్ గారు)
అరమర లేని జీవిత మహర్నిశముల్ సుమభావబంధుర
స్థిరతరసాహితీమధురతీర్థముఁ గ్రోలి వధానవిద్యకున్
గురుతర సేవఁ జేయు రసకోవిదుఁ డొక్కఁడు మ్రోగ నెంచఁగా
మురళికి రంధ్రముల్ వడెను ముచ్చటగా శతసంఖ్య లొప్పుచున్.

2) "ఆలిడు పాలు చాలును గదా రసమాధురు లొల్క నాల్కకున్"
(మైలవరపు మురళీకృష్ణ గారు)
కాలవశంబు లైనవి జగమ్ములయందున సర్వతంత్రముల్,
మే లొనరించుఁ గొన్ని మరి మేరలు మీరిన కీడుఁ జేయుఁ, ద
త్వాల గణించి యోగిరము తథ్యముఁ బథ్యముగా గ్రహించినన్
ఆలిడు పాలు చాలును గదా రసమాధురు లొల్క నాల్కకున్.

3) "పరహింసాపరులైన దుర్మతులకున్ బాటిల్లుఁ గైవల్యముల్"
(M.S.V. గంగరాజు గారు)
స్మరియింపన్ వలె నిత్యమున్ మనసులో సాక్షాన్మహాదేవునిన్,
దరిజేరన్ వలె భక్తిభావయుతులై ధ్యానంబులన్ జేయుచున్,
దురపేక్షాపరులైనవారికి సదా దూరంబుగా నున్నచోఁ
బరహింసాపరులైన దుర్మతులకున్ బాటిల్లుఁ గైవల్యముల్.

4) "తిరుమల వేంకటేశ్వరుఁడె దేవుఁడు క్రైస్తవభక్తకోటికిన్"
(కంది శంకరయ్య గారు)
తిరుమల వేంకటేశ్వరుఁడె దేవుఁడు హైందవభక్తకోటికిన్
విరచితసర్వశాస్త్రగతవిద్యల సారము సంగ్రహించినన్
బరిపరి భేదముల్ విడుచు వాక్యమునందున దృష్టి నిల్పినన్
దిరుమల వేంకటేశ్వరుఁడె దేవుఁడు క్రైస్తవభక్తకోటికిన్.

5) "దధిపాత్రమ్మునఁ గాలకూట మెసఁగెన్ దావానలాభీలమై"
(మాధవ రెడ్డి గారు)
సుధకై చేరి సురాసురుల్ మహిమతో శోభాయమానంబుగా
మధియించంగను క్షీరసాగరముఁ, గూర్మంబై మహావిష్ణువే
విధులం జేయుచునుండ తొట్టతొలుతన్ బీభత్సమై తన్మహో
దధిపాత్రమ్మునఁ గాలకూట మెసఁగెన్ దావానలాభీలమై.

6) "కలువలు భస్మమాయె శశికాంతులు సోకిన తత్క్షణంబునన్"
(కల్వగుంట్ల రామమూర్తి గారు)
విలువలు లేని విద్యలను వేలము వెఱ్ఱిగ నేర్చుచుండి రీ
తులువలు, కామవాంఛలకుఁ దొత్తులుగా గుణశీలబాహ్యులై
బలిమిని స్త్రీలనెల్లఁ జెరఁ బట్టుచుఁ బ్రేమలఁ గాల వ్రాయఁగాఁ
గలువలు భస్మమాయె శశికాంతులు సోకిన తత్క్షణంబునన్.

7) "వడదెబ్బకు వృద్ధుఁ డొకఁడు వహ్వా యనియెన్"
(సుబ్బ రాఘవ రాజు)
జడదెబ్బఁ దిన్న నాఁడుల
గడసరి జ్ఞాపకముఁ దలఁచి కనుగీటఁగ నా
విడ చేతి వడను విసిరెను
వడదెబ్బకు వృద్ధుఁ డొకఁడు వహ్వా యనియెన్.

8) "ఎండలు మండుటయు నిచ్చు నెంతో హాయిన్"
(మన్నవ గంగాధర ప్రసాద్)
దండిగ మజ్జిగ నిచ్చెడు
పండితుఁ డొకఁ డుండి కావ్యపఠనముఁ జేయన్
జండాంశుఁడు చంద్రుం డగు
నెండలు మండుటయు నిచ్చు నెంతో హాయిన్.

9) "క్రోఁతినిఁ బెండ్లియాడు మికఁ గూటికి గుడ్డకు లోటు రా దిలన్"
(టెంకాయల దామోదరం)
జాతర వచ్చె నింక జలజాతముఖుల్ నడయాడుచుందు రీ
భూతలమందుఁ, గన్నెలనుఁ బూని వరించుము, వంక లేలనో
క్రోఁతులు కొంగ లంచుఁ, గడు గొప్ప ధనాఢ్యుని కూఁతుఁ జూచి యా
క్రోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు రా దిలన్"

10) "సారా తెమ్మనె రాఘవుండు హనుమన్ సంతోష మేపారఁగన్"
(డా. మాలేపట్టు పురుషోత్తమాచారి గారు)
ఘోరాశీవిషదైత్యబాణకృతసంక్షోభమ్మునన్ లక్ష్మణుం
డా రక్షోజనమధ్యరంగమునఁ బ్రాణాపాయమం దుండఁగాఁ
జేరెన్ మారుతి మూలికాస్థగితప్రస్థీయుక్తుఁడై "వీర! దో
స్సారా! తె"మ్మనె రాఘవుండు హనుమన్ సంతోష మేపారఁగన్.

11) "హనుమత్పుత్రుఁడు భీష్మపుత్రిని వివాహం బాడె దీవింపుఁడీ"
(గుమ్మడి జయరామిరెడ్డి గారు)
ఘనసంస్కారవిలాసమానవతియై కారుణ్యవాక్సీమయై
వినయోదంచితవర్తనాగరిమయై విద్యాప్రవీణాఢ్యయై
కనులం దన్పెడి రుక్మిణీసతిని ఋక్సామాదివేదాంతదే
హను మత్పుత్రుఁడు భీష్మపుత్రిని వివాహం బాడె దీవింపుఁడీ.

12) "మల్లియ తీఁగకున్ గలిగె మామిడికాయలు నేత్రపర్వమై"
(విద్వాన్ జి. గోవిందయ్య గారు)
చల్లని రేయి వెన్నెలలు సాంద్రతరమ్ముగ వ్యాప్తి నొందఁగా
నల్లన వచ్చె భామ విరహాతురుఁ డాతఁడు కొంగు లాగి తా
మెల్లఁగఁ గన్నుగీటెను తమిం గొనియాడి వయారి! యిచ్చటన్
మల్లియ తీఁగకున్ గలిగె మామిడికాయలు నేత్రపర్వమై.

13) "రాముఁడు గౌతముని సతిని రంజిలఁ జేసెన్"
(శ్రీరాములు గారు)
ప్రేమమయంబగు దైవము
భామకు శాపంబుఁ బాపి పతిదేవుని స
ద్ధామముఁ జేర్చఁగ దశరథ
రాముఁడు గౌతముని సతిని రంజిలఁ జేసెన్.

14) "కత్తులఁ గని బాలుఁ డొకఁడు కరకర నమిలెన్"
(డా. వి. జయమ్మ గారు)
మొత్తం బిచ్చెద ననుచును
చిత్తం బూరించు తల్లి చేష్టల విసిగెన్
దుత్తల దొంతరలో బి
స్కత్తులఁ గని బాలుఁ డొకఁడు కరకర నమిలెన్.

15) "కారముతో నాముదాల కవి యలరారెన్"
(డా. మస్తానమ్మ గారు)
రారండని పిలువంగనె
చేరిన సాహిత్యపరులు స్నిగ్ధమనస్కుల్
గూరిమి నెచ్చెడి యీ సహ
కారముతో నాముదాల కవి యలరారెన్.

16) "పయ్యెద జారెఁ గోమలికిఁ బాపని బొజ్జనుఁ గాంచినంతటన్"
(డా. పి.సి. వెంకటేశ్వర్లు గారు)
కుయ్యిడుచున్న బాలుఁ గని కోడలి వంకకుఁ జూచె నత్తయున్
పొయ్యిని వీడి వచ్చె నటు పొంగుచునుండెడి పాలు దించి "రా
రయ్య" యటంచు దగ్గరకు హారతు లెత్తిన ప్రేమ జోరులోఁ
బయ్యెద జారెం గోమలికిఁ బాపని బొజ్జనుఁ గాంచినంతటన్.

17) "మమతలు దూరమైనపుడె మానవజాతియు వృద్ధినొందెడున్"
(కత్తి మమత గారు)
క్రమముగ ప్రేమ తగ్గె ధనకాంక్షకు లోకము లొంగెఁ బిల్లలన్
సమిధలఁ జేయు విద్యలిట సాగుచునుండెఁ బ్రమాదఘంటికల్
ప్రమదల చుట్టు మ్రోగె పరిరక్షణ లేదు గణింప నిట్టి దు
ర్మమతలు దూరమైనపుడె మానవజాతియు వృద్ధినొందెడున్.

18) "కుక్కకు చెమ్మటల్ బొడమకుండును రేఁబగ లొక్కరీతిగన్"
(మాధవీలత గారు)
మిక్కుటమైన యెండలకు మేనులు బొబ్బలు పుట్టె దుర్భరం
బక్కట! ప్రాణముల్ నిలుచు నాశలు లేవిక పుత్ర! దేహముల్
స్రుక్కెఁ దుషారయంత్రములు సోషిలఁ జేయవు గానఁ దెమ్ము మా
కుక్కకు చెమ్మటల్ బొడమకుండును రేఁబగ లొక్కరీతిగన్.

19) "రతికిన్ దూరము గాని మేటి యతియే రాజిల్లు మోక్షార్థియై"
(డా. నెమిలేటి కిట్టన్న గారు)
శతసంవత్సరకాలజీవితము నిస్సారంబుగా నెంచి శా
శ్వతసత్యంబగు బ్రహ్మమున్ మనసులో స్థాపించి నిష్కాముఁడై
సతతానందవిలోలమూర్తిమహితస్వాంతుండు వేదాంత భా
రతికిన్ దూరము గాని మేటి యతియే రాజిల్లు మోక్షార్థియై.

20) "రాతిరి సూర్యుండు నంబరమునన్ దోఁచెన్"
(యువశ్రీ మురళి గారు)
పూతమనస్కులు యోగులు
చేతముద మొప్పఁ దపముఁ జేయుచునుండన్
బ్రాతిగ నంతట జరిగెను
రాతిరి; సూర్యుండు సంబరమునన్ దోఁచెన్.

21) "కలదే యిలలోన హాయి కైవల్యమునన్" (వృత్తంలో పూరించాలి)
(డా. నాదెండ్ల శ్రీమన్నారాయణ గారు)
తుల్యపు భావముల్ గలుగు తొయ్యలి భార్యగ ముద్దుఁ గూర్చు సా
కల్యమనోరథంబులనఁ గల్గిన పుత్రుల దైవమాతృకౌ
హల్యపు భూమి గల్గ మనసా కలదే యిలలోన హాయి కై
వల్యమునన్ వికుంఠపురవర్యమునన్ మఱి యెందుఁ జూచినన్.

22) "తలవ్రాతను మార్చ బ్రహ్మ తరమే ధరలో"
(గంగుల నాగరాజు గారు)
కలుములు లేములు గల్గిన
వలయం బీ జీవితంబు ప్రాప్తించిన యా
ఫలములఁ జేకొనవలయును
తలవ్రాతను మార్చ బ్రహ్మ తరమే ధరలో?

23) "తిరుపతి పురవాసులెల్లఁ దిర్యగ్జడముల్"
(మల్లిపూడి రవిచంద్ర గారు)
స్మరియింతురు గోవిందునిఁ
దిరుపతి పురవాసులెల్లఁ; దిర్యగ్జడముల్
హరి సేవకుఁ బాత్రములై
తరియించును మోక్షసిద్ధి తదనంతరమున్.

24) "మామిడిచెట్లకుఁ గాసె మెండుగాఁ బనసలు కోయ రండహొ" (ఛందోగోపనం)
(తారకరామ్ గారు)
వినుతినిఁ గాంచు పుష్పఫలవృక్షతదాశ్రయకీరపైకమౌ
వనయజమాని పల్కె నిటు "ప్రాప్తము లేనిదె భాగ్య మబ్బునే
మనిషికిఁ, జీడ పట్టినది మామిడిచెట్లకుఁ, గాసె మెండుగాఁ
బనసలు, కోయ రండహొ విపన్నులఁ గావఁగ దైవ ముండెడిన్".

25) "చెవిటి నర్తించె సంగీతము విని సభను"
(సాత్పాటి సురేశ్ గారు)
రాజనర్తకి సభ నాడ రాని దివస
మొక్క వేశ్యను పిలిపించె నుర్విపతియు
కాలు కందగ నాడగాఁ గంబళిఁ బర
చె, విటి నర్తించె సంగీతము విని సభను.

26) "స్తనములు లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాదు చూడఁగన్"
(విద్వాన్ బి. కన్నయ్య గారు)
వనజజు నాల్కపై సతతవాసముఁ జేసెడి పల్కులమ్మకున్
స్తనములు రెండు వాఙ్మయము తాన లయాన్వితగానవిద్య లా
స్తనములు పూరుషుండు దగు సాధనఁ జేసియుఁ బొంద నొప్పు నా
స్తనములు లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాదు చూడఁగన్.